జలలింగం.. జంబుకేశ్వరం

శంకరుడు జలలింగం రూపంలో ఆవిర్భవించిన క్షేత్రం జంబుకేశ్వరం. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో తిరువనైకావల్‌లోని ఆలయం పంచభూతాల్లో ఒకటైన జలానికి నిదర్శనంగా ఉంది. స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. పార్వతీ మాత అఖిలాండేశ్వరిగా జన్మించిన మహాపుణ్యక్షేత్రమిది. ఒక వైపు కావేరి నది, మరో వైపు కొలరున్‌ నదుల మధ్య ఏర్పడిన ద్వీపంలో జంబుకేశ్వరం ఉంది. తొలి చోళ రాజుల్లో ఒకరైన కొచెంగ చోళుడు నిర్మించినట్టు సంగం గ్రంథాల ద్వారా తెలుస్తోంది. శివభక్తులు నయనార్లు తమ గ్రంథాల్లో జంబుకేశ్వరుడిని స్తుతించారు.

స్థలపురాణం
మహదేవుని ఆజ్ఞ మేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా జన్మించారు. నిత్యం శివుని ఆరాధనతో తరించేది. కావేరి నదిలోని జలంతో లింగాన్ని తయారుచేసి పూజలు చేయడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్తు అమ్మవారు పూజించిన లింగం కావడంతో పరమ పవిత్ర ప్రదేశంగా ఖ్యాతి చెందింది. అందుకనే అప్పుస్థలగా కూడా పిలుస్తారు. దీనికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. జంబు అనే మునీశ్వరుడు కఠోరంగా పరమేశ్వరుని దర్శనం కోసం తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై అతనికి కొన్ని పండ్లను కానుకగా ఇచ్చాడు. భగవంతుడు స్వయంగా ఇచ్చిన పండ్లు కావడంతో వాటి గింజలను బయటకు పడేయలేక మింగేస్తాడు. అనంతరం ఆ గింజల నుంచి వేర్లు శిరస్సు ద్వారా బయటకు రావడంతో ముని శివసాయుజ్యం పొందినట్టు తెలుస్తోంది. అందుకనే స్వామి జంబుకేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు.

మరో కథనం ప్రకారం.. సాలెపురుగు, ఏనుగు శివలింగాన్ని భక్తితో పూజించి శివసాయుజ్యం పొందినట్టు తెలుస్తోంది. ఈ కథనం శ్రీకాళహస్తి క్షేత్రంతో పోలివుండటం విశేషం. శివకవి తిరునవక్కురసర్‌ తన రచనల్లో స్వామి వారి మహిమలను వర్ణించాడు. స్వామిని ప్రార్థిస్తే చింత లేని జీవితం ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామిని జగన్మాత అఖిలాండేశ్వరి ప్రతిరోజూ మధ్యాహ్నం ప్రార్థిస్తుందని భక్తకోటి ప్రగాఢ విశ్వాసం.

Visit Us On FacebookVisit Us On TwitterVisit Us On Youtube