కిమ్‌తో సమావేశం.. నచ్చకపోతే బయటకు వచ్చేస్తా

 

 

వాషింగ్టన్‌: శత్రుదేశాలైన అమెరికా, ఉత్తర కొరియా చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జూన్‌ ప్రారంభంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దీనికి సంబంధించి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనకు చర్చలు ఆశాజనకంగా అనిపిస్తేనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో సమావేశంలో పాల్గొంటానని చెప్పారు. ఇరు దేశాల మధ్య సమావేశం అంచనాలకు తగినట్లు లేకపోతే బయటకు వచ్చేస్తానని స్పష్టం చేశారు. అణ్వస్త్ర రహితంగా మారడంపై మరికొన్ని వారాల్లో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను కలిసి చర్చలు జరపనున్నామని ట్రంప్ అన్నారు. అయితే ముందుగానే ఈ సమావేశం సఫలీకృతం అయ్యే అవకాశం లేనట్లు అనిపిస్తే.. అసలు చర్చలకే వెళ్లబోము అని ట్రంప్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఫ్లోరియాలో జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒకవేళ సమావేశం జరిగేప్పుడు అది ఆశాజనకంగా అనిపించకపోతే గౌరవప్రదంగా మీటింగ్‌ నుంచి వెళ్లిపోతానని ట్రంప్‌ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు సమావేశం జరిగే వేదికను నిర్ణయించే పనిలో ఉన్నారు. ఐదు వేర్వేరు వేదికలను పరిశీలించారు. వీటిలో ఏదీ అమెరికాలో లేదు. కిమ్‌తో సమావేశం విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నానని, అందుకోసం ఎదురుచూస్తున్నానని ట్రంప్‌ వెల్లడించారు. సమావేశం సజావుగా సాగితే ప్రపంచానికి అది చాలా అద్భుత విషయమవుతుందన్నారు. ఉత్తర కొరియాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడుదల చేసే అంశంపైనా కిమ్‌తో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు. ఉత్తర కొరియా విషయంలో సహాయం చేస్తున్నందుకు ట్రంప్‌ చైనాను ప్రశంసించారు.

Visit Us On FacebookVisit Us On TwitterVisit Us On Youtube